ఖైరతాబాద్పై ఏం చేద్దాం?..కాంగ్రెస్ పెద్దల సమాలోచనలు

ఖైరతాబాద్పై ఏం చేద్దాం?..కాంగ్రెస్ పెద్దల సమాలోచనలు

హైదరాబాద్, వెలుగు: ఖైరతాబాద్ ఉప ఎన్నిక చిక్కు ముడి విప్పేందుకు కాంగ్రెస్ పెద్దలు వ్యూహాత్మకంగా ముందుకువెళ్తున్నట్టు తెలిసింది. 2023 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన పీజే ఆర్ కూతురు విజయా రెడ్డి.. దానం ఎన్నిక చెల్లదంటూ హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల నిర్వహణ పై పీటముడి పడిన సంగతి తెలిసిందే. తీర్పు వచ్చేదాకా ఎన్నికల షెడ్యూల్​ఇవ్వబోమని ఇప్పటికే ఈసీ  స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఆటంకం కలగకుండా, ఇటు దానం నాగేందర్‌‌‌‌కు అటు విజయా రెడ్డికి రాజకీయంగా న్యాయం చేసే దిశగా సీఎం రేవంత్ ​రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ ​గౌడ్ ​యోచిస్తున్నారని, ఇందులో భాగంగా కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయని కాంగ్రెస్​ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

గ్రేటర్‌‌‌‌లో పార్టీ బలోపేతానికి చాన్స్..

వచ్చే నెలలో గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ పదవు లు ఖాళీ అవుతున్నాయి. ఇందులో ఒకటి లేదా రెండు బీసీలకు ఇవ్వాలని పార్టీ హైకమాండ్ యోచిస్తోంది. బీసీ కోటాలో దానంను మండలికి పంపించి, మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదనను సీఎం, పీసీసీ చీఫ్.. కాంగ్రెస్ హైకమాండ్ ​ముందు పెట్టినట్టు తెలుస్తున్నది. అప్పుడు ఖైరతాబాద్ సీటును విజయారెడ్డికి కేటాయించి, గెలిపించుకునే బాధ్యతను దానంకే అప్పగించాలనే ఆలోచనతో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు చెప్తున్నారు.

కోర్టులో విజయారెడ్డి కేసును విత్​డ్రా చేసు కుంటే ఎన్నికలకు లైన్ క్లియర్​అవుతుందని భావిస్తున్నారు. దీని వల్ల ఇటు దానంకు, అటు విజయా రెడ్డికి.. ఇద్దరికీ న్యాయం చేయవచ్చని, అంతేకాకుండా సొంత పార్టీలో గ్రూపు తగాదాలకు చెక్ పెట్టవచ్చనేది నేతల అభిప్రాయంగా తెలుస్తున్నది. ఈ నిర్ణయం ద్వారా గ్రేటర్‌‌‌‌లో కాంగ్రెస్ బలం పెరగడంతోపాటు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయవచ్చని సీఎం, పీసీసీ చీఫ్ భావిస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తున్నది. ఈ విషయాన్ని ఒకటి, రెండు రోజుల్లో ఇతర సీనియర్ నేతలతో చర్చించి, తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.